ధరణి ఆస్తుల నమోదు..ప్రభుత్వాకి హైకోర్టు ఆదేశాలు

యాప్ భద్రతకు ఏ చర్యలు తీసుకుంటారో తెలపాలన్న హైకోర్టు

TS high court
TS high court

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ కోసం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదులో భాగంగా ఆధార్‌ వివరాల కోసం ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను థర్డ్‌ పార్టీకి ఇవ్వొద్దని తెలిపింది. ధరణిలో ఆస్తుల నమోదుపై దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ధరణిలో ఆస్తుల నమోదు విషయంలో వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ఆధారంగా ఆధార్‌, కులం వివరాలను సేకరిస్తున్నారని ప్రశ్నించింది.

కొత్త రెవెన్యూ చట్టం సాగు భూములకు సంబంధించింది మాత్రమేనని.. డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని హైకోర్టు పేర్కొంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయని హైకోర్టు తెలిపింది. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోందని.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలనాలరి హైకోర్టు కోరింది. డేటా దుర్వినియోగమైతే ప్రజల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని అయితే ప్రభుత్వం మాత్రం ఆస్తుల నమోదు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని హైకోర్టుకు తెలిపింది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. డేటా భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కౌంటర్‌ దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టును కోరారు. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ఆస్తుల వివరాల నమోదు కోసం ధరణి యాప్, పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/