తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో హైకోర్టులో నేడు ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్‌ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది.

సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్‌పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్‌ను హైకోర్టు నమోదు చేసుకుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/