అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్‌

జీతాలిచ్చేది నిద్రపోవడానికా అంటూ జిహెచ్‌ఎంసి అధికారులకు చురకలు

High Court of Telangana
High Court of Telangana

హైదరాబాద్: నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతూంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇలాంటి నిర్మాణాలను తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తూ ఇద్దరు పౌరులు దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి మార్చి 24న జరిగే విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సాగనంపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సిబ్బంది కళ్లు మూసుకొని ఉండకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి అక్రమాలు చూస్తూ నిద్రపోయేందుకు మీకు జీతాలు చెల్లించడం లేదని ఆక్షేపించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/