అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈ నెల 25కి వాయిదా

భూములు అభివృద్ధి చేసి సొమ్ము సమీకరిస్తామన్న అగ్రిగోల్డ్
అంగీకరించని కోర్టు

హైదరాబాద్: నేడు తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. భూములు అభివృద్ధి చేసిన సొమ్ము సమీకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ న్యాయస్థానానికి ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను కోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ ప్రతిపాదనకు అంగీకరిస్తే, భూముల అభివృద్ధి, వాటి పర్యవేక్షణకే 20 ఏళ్లు పడుతుందని కోర్టు భావించింది.

ఈ సందర్భంగా మిడ్జిల్ ప్రాంతంలోని 150 ఎకరాల వేలంపై తెలంగాణ సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లే బినామీల ద్వారా భూములు దక్కించుకున్నట్టు సందేహం వ్యక్తం చేశారు. సంస్థ డైరెక్టర్ సన్నిహితుడే రూ.15.18 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. అయితే వేలంపై అనుమానాలు ఉండడంతో భూమిని అప్పగించలేదని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. విజయవాడలో వేలం వేసిన షాపింగ్ మాల్ అప్పగింతకు సమయం కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం స్పందిస్తూ, అగ్రిగోల్డ్ కేసును ఏపీకి బదిలీ చేసే అంశం ప్రధాన న్యాయమూర్తి పరిశీలనలో ఉందని వెల్లడించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/