తెలంగాణలో రేపటి నుంచి ‘రైతుబంధు’ పథకం నిధుల పంపిణీ

ఈ సీజన్‌లో రూ. 7,600 కోట్ల పంపిణీ

హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ పథకం సొమ్ము జమకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. గత జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాలంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు చెందిన 63.25 లక్షల కమతాలకు రూ. 7,508.78 కోట్లు జమ చేయగా, ప్రస్తుత యాసంగి సీజన్‌లో రూ. 7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖ అంచనా.

జూన్ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొత్తగా 20 వేల మంది భూములు కొనుగోలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. వీరి వివరాలను కనుక ఏఈవోలు నమోదు చేస్తే రైతుబంధు సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లోనూ జమ అవుతుంది. రేపటి నుంచి రైతు బంధు సొమ్ము పంపిణీ కానుండగా, తొలుత ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి ఒక్కో ఎకరం పెంచుకుంటూ సొమ్ము జమ చేస్తారు. ఆన్‌లైన్‌లో పథకం సొమ్ము జమ అయ్యాక రైతు సెల్‌ఫోన్‌కు ఆ వివరాలతో ఓ ఎస్సెమ్మెస్ వస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/