భారీ వరదలతో తెలంగాణ రాష్ట్రంలో రూ.1400కోట్ల నష్టం..కేంద్రానికి నివేదిక

ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు రూ.1400కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కార్ కేంద్రానికి నివేదిక పంపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు కురిసాయి. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అని చాలామంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గోదావరి మట్టం రికార్డు స్థాయిలో ప్రవహించింది.

భద్రాచలం వద్ద దాదాపు 36 ఏళ్ల తర్వాత 70 అడుగుల మేర గోదావరి ప్రవహించింది. దీంతో పట్టణంలోని పలు కాలనీ లు నీటమునగా..ముంపు గ్రామాలు దాదాపు వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ప్రస్థుం శాంతించడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక కడెం ప్రాజెక్ట్ సైతం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే భయానకంగా వరద పోటెత్తింది. ఇక వందల ఇల్లు నీటమునిగాయి. ఎన్నో రోడ్లు తెగిపోవడం తో రాకపోకలు బంద్ అయ్యాయి. చాల చోట్ల కరెంట్ స్థంబాలు విరిగిపడడం తో పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ఇక వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. ఈ తరుణంలో రాష్ట్ర సర్కార్ వరద నష్టాల ఫై కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

నష్టాల వివరాల్లోకి వెళ్తే..

వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.449 కోట్లు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.379కోట్లు. విద్యుత్‌శాఖలో రూ.7కోట్ల నష్టం జరిగినట్లు ఆయాశాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందించాయి. ఇక ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక పంపారు.