పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచిన తెలంగాణ సర్కార్

పుర‌పాలికల్లో ప‌ని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబురు అందించింది. పారిశుద్ధ్య కార్మికుల‌కు ఇప్పుడు ఉన్న వేత‌నాల‌కు 30 శాతం వేత‌నాలు పెంచుతున్నట్లు తెలిపింది. గ‌త ఏడాది జూన్ 1 వ తేదీ నుంచి ఈ నిర్ణ‌యం అమలు అవుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను రాష్ట్ర పుర‌పాలక శాఖ జారీ చేసింది.

కేసీఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,804 మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. అలాగే ఆశా వర్కర్ల జీతాలను 30 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తాజా నిర్ణయంతో నెలసరి ప్రోత్సాహకాలు 7500 నుంచి రూ. 9750 కి పెరగనున్నాయి. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఎం హెచ్ ఎం కింద పని చేస్తున్న ఆశా వర్కర్ల నెలసరి ప్రోత్సాహకాలు పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ మాసం నుంచి ఈ పెంచిన ఇన్సెంటివులు వర్తిస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ రాష్ట్రంలోని.. ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.