మునావర్ ఫరూకీ కామెడీ షోకి తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌

మునావర్ ఫరూకీ కామెడీ షోకి తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు బిజెపి vs టిఆర్ఎస్ గా మారింది. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మునావర్ , ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ తను షో నిర్వహిస్తున్నాడు. రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

మునావర్‌ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తప్పుబట్టారు. మునావర్‌ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. హిందూ వ్యతిరేకి అయిన మునావర్ కామెడీ షో హైదరాబాద్‌లో నిర్వహించడానికి వీల్లేదని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయన హైదరాబాద్‌కు వస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహణకు ముందుకు రాగా.. మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. హిందూ సమాజాన్ని కామెడీ చేసే వాళ్లకి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వెనక్కి తగ్గని కేటీఆర్.. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది. ఇక రేపు ఈయన షో జరగబోతుడడం తో చర్చ కు దారి తీసింది. మరి రేపు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో చూడాలి.