కౌశిక్‌ రెడ్డి కి షాక్ ఇచ్చిన గవర్నర్‌ తమిళిసై..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ భారీ ప్లాన్లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సరికొత్త పధకాలను నియోజకవర్గం లో తీసుకొస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నాడు. కేవలం ఓటర్లనే కాదు లీడర్స్ సైతం తమ వైపు తిప్పుకుంటున్నారు. పలు పదవులతో ఇతర పార్టీల నేతలను తమ వైపు లాక్కుంటున్నారు. ఈ తరుణంలో తెరాస లో చేరిన కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డికి తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై షాక్ ఇచ్చారు. తెరాసలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవిని గవర్నర్ కోటాలో ఇవ్వాలని సిఎం కేసీఆర్ భావించారు. ఈ మేరకు ఒక ప్రతిపాదన గవర్నర్ వద్దకు పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కౌశిక్‌ రెడ్డి ఫైల్‌ విషయంపై కూడా స్పందించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్‌ నా దగ్గరే ఉందన్న గవర్నర్‌ .. నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు. సామాజిక సేవ చేసినవాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాలి అని అన్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా అని అన్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు ఆపుతారా? అంటూ అడిగిని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. మీరు ఏమైనా ఊహించుకోండి.. కానీ, నేను ఆ ఫైల్‌ను స్టడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. గవర్నర్‌ మాటలు ఇప్పుడు కౌశిక్‌ రెడ్డి కి షాక్ ఇచ్చాయి.