సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయనను లోకేశ్​ సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్, చంద్రబాబు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుమారు 2 గంటల పాటు భేటీ అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలకగా.. పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు గవర్నర్‌కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఈవో కేఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని ఆయనకు అందించారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని.. విభజన సమస్యలపై ఎలాంటి చర్చా జరగలేదని గవర్నర్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉందని.. ప్రత్యేకంగా ఎలాంటి అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని తెలిపారు.