పేరు మారనున్న రైతు సమన్వయ సమితి?

రైతు సమన్వయ సమితిని రైతు బంధు సమితిగా మార్చనున్నట్లు వెల్లడించిన కెటిఆర్‌

Minister KTR meeting with newly elected DCCB, DCMS Chairmans
Minister KTR meeting with newly elected DCCB, DCMS Chairmans

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు సమన్వయ సమితి పేరును త్వరలోనే మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి పేరును రైతు బంధు సమితిగా మార్చనున్నట్టు ఆయన వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు మరోసారి తిరుగులేని విజయాన్ని అందించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 906 సంఘాలకు ఎన్నికలు జరిగితే 94 శాతానికిపైగా సంఘాల్లో రైతులు టిఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. టిఆర్‌ఎస్‌ రైతుపక్షపాత ప్రభుత్వమని… రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని వివరించారు. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదని కెటిఆర్‌ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/