అపాయింట్ మెంట్ ఇవ్వగానే.. గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధం: తెలంగాణ ప్రభుత్వం

Lieutenant governor recommends President’s rule in Puducherry

హైదరాబాద్ః గవర్నర్‌ తమిళిసైను కలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. గవర్నర్ ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి వివరణ ఇచ్చేందుకు మంత్రి, అధికారులు సిద్దమైనట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గవర్నర్​ ను కలవమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్​ నుంచి లేఖ వచ్చిందన్నారు. ఇప్పటికే గవర్నర్​ అపాయింట్​మెంట్​ కోరామని, ఇంకా తేదీ ఖరారు కాలేదన్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వగానే గవర్నర్​ తమిళి సైను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు.

తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై రాజ్ భవన్ కు వచ్చి చర్చించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గవర్నర్ ఆదేశించారు. ఈనెల 7వ తేదీన సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. మూడేళ్లుగా యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని లేఖలో గవర్నర్ ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందులో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని ఆమోదించడం వల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా..? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో చెప్పాలని, రిక్రూట్ మెంట్ పై వివరణ ఇవ్వాలని మంత్రి సబితకు గవర్నర్ సూచించారు.

కాగా గవర్నర్ తమిళి సై రెండు రోజల ఢిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం రాజ్‌‌భవన్‌‌లో కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సాయంత్రం గవర్నర్ స్పందించనున్నారు. పెండింగ్ బిల్లులు, ప్రభుత్వంతో ముదురుతున్న వివాదంపై తమిళిసై వివరణ ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి లేఖ రాసిన అంశంతో పాటు యునివర్సిటీల్లో నెలకొన్న సమస్యలు, బిజెపి నేతల ఫోన్‌ టాపింగ్ ఫిర్యాదులపై గవర్నర్ స్పందించనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/