ద‌స‌రా సెలవులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్

దసరా సెలవులపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని ఎస్‌సీఈఆర్‌టీ విద్యాశాఖను కోరింది. జూలైలో వర్షాలు, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, అందుకే దసరా సెలవులను 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్రంలో ద‌స‌రా సెల‌వుల షెడ్యూల్ మార‌నుందంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నాయి.

దీంతో విద్యాశాఖ దీనిపై స్పందించింది. దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెలవుల కుదింపుపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. అక్టోబ‌ర్ 10న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అవుతాయ‌ని తెలిపింది.