మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా విస్తారంగా వర్షలు పడుతున్న సంగతి తెలిసిందే.మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రేపు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు తెగిపోయాయి. పంటపొలాలు నీటమునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీటిలో మునిగాయి. మరో రెండు , మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరం ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాత్రివేళ్లల్లో పోలీసులను విధుల్లో ఉంచుతామని కమిషనర్‌ తెలిపారు.

జీహెచ్‌ఎంసీతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. వరదలతో చెరువులు నిండి ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని సూచించారు.