ఆర్టీసీ కార్మికులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Telangana government gave Diwali gift to RTC workers


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది సర్కార్. సకల జనుల సమ్మె సమయంలో జీతాలు రాని వారికి రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. నష్టాల నుంచి టీఎస్‌ ఆర్టీసీ క్రమంగా కోలుకొంటున్నందున ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఇటీవల సీఎం కేసీఆర్‌తో చర్చించామన్నారు. సీఎంతోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచనల మేరకు పలు సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

పీఆర్సీని ప్రకటించేందుకు మునుగోడు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉన్నదని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు వెల్లడించారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించడంపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 2020 నాటికి మెచ్యూర్‌ అయిన బాండ్లపై కార్మికులకు వడ్డీ చెల్లించే అంశం కూడా పరిశీలనలో ఉన్నదని, సీఎస్‌, పీఎఫ్‌ సహా అన్ని బకాయిల చెల్లింపు అంశాన్ని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఫెస్టివల్ అడ్వాన్స్ రూ.20 కోట్లు, ఎరియర్స్ రూ.20 కోట్లు చెల్లిస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ స్థానిక ప్రభుత్వాలు ఆర్టీసీలను ఆదుకోవడం లేదని, తెలంగాణలో మాత్రమే ఆర్టీసీకి ప్రభుత్వం అండగా ఉన్నదని చెప్పారు.