డెంగీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతమవుతున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెల్త్, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి డెంగీ నివారణ చర్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగు­తున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్‌ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్‌ ఆదేశించారు.

ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి తిరిగి ఆశాలు, ఏఎన్ఎంలు మందులు కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఎంఎస్ఐడీసీ మందుల కిట్లను సిద్ధం చేస్తోంది. జ్వర లక్షణాలు ఉన్నవారికి ఈ మందులు వాడాలని పంపిణీ చేయనున్నారు. ఈ కిట్ తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే టెస్టులు చేస్తారు. అంతేగాక ప్రతీ రోజు మానిటరింగ్ చేసేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు వివరాలు నమోదు చేసుకోనున్నారు.