కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ

హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన ఏర్పాటు చేసిన కేఆర్ఎంబీ సమావేశానికి రావడం కుదరదని లేఖలో స్పష్టం చేశారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉందని వివరించారు. దీనిపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. సంప్రదింపుల తర్వాత తదుపరి తేదీని ఖరారు చేయాలని తెలంగాణ ఈఎన్సీ పేర్కొన్నారు.

ఈ నెల 9న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించారు. కొన్నిరోజుల కిందట ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. దాంతో 9వ తేదీకి సమావేశ తేదీని మార్చారు. ఇప్పుడు కూడా తాము రాలేమని తెలంగాణ పేర్కొంటోంది.

కొన్నివారాల కిందట నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ అసంతృప్తితో ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/