ఈ ఏడాది తెలంగాణలో సైబర్ నేరాలు 57 శాతం పెరిగాయిః డీజీపీ

రాష్ట్రంలో నేరాల రేటు 4.4 శాతం పెరిగినట్టు స్పష్టీకరణ

telangana-dgp-releases-annual-crime-report-of-telangana-state

హైదరాబాద్‌ః తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నేరాల రేటు 4.4 శాతం పెరిగిందని, అందులో సైబర్ నేరాల వాటానే అధికమని తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తెలంగాణలో సైబర్ నేరాలు 57 శాతం పెరిగాయని వివరించారు. ఇవాళ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ వార్షిక క్రైమ్ రిపోర్ట్ (యాన్యువల్ రౌండప్-2022)ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది కన్విక్షన్ రేటు (నేర నిరూపణ రేటు) 50 శాతం ఉంటే, ఈ ఏడాది మరో 6 శాతం పెరిగి 56 శాతంగా నమోదైందని వెల్లడించారు. దోషులకు త్వరగా శిక్ష పడేలా చేయడంలో తెలంగాణ పోలీసులు సఫలమయ్యారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 152 మందికి జీవితఖైదు పడింది.

డీజీపీ ప్రసంగంలో ముఖ్య వివరాలు…

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మలచడంలో పోలీసు విభాగం ప్రముఖ పాత్ర పోషించింది.
మావోయిస్టులు రాష్ట్రంలో ప్రవేశించకుండా చేయగలిగాం.
ఈ ఏడాది 3 ఎన్ కౌంటర్లు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు హతులయ్యారు. ఈ సంవత్సరం పోలీసుల ఎదుట 120 మంది నక్సల్స్ లొంగిపోయారు.
మతపరమైన హింసను అరికట్టాం.
రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగినా… ఈ కేటగిరీలో అత్యాచార కేసులు, పోక్సో చట్టం కేసులు తగ్గాయి. అదే సమయంలో గృహ హింస, వరకట్న వేధింపుల కేసులు పెరిగాయి.
డ్రగ్స్ వ్యవహారాల్లో ఉక్కుపాదం మోపుతున్నాం. 1,176 కేసులు నమోదు కాగా, 2,582 మందిని అరెస్ట్ చేశాం.
తెలంగాణలో సీసీ టీవీ వ్యవస్థను మరింత పెంపొందించాం. ఒక్క సీసీటీవీ కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానం. ఈ ఏడాది సీసీ కెమెరాల సాయంతో ఛేదించిన కేసుల సంఖ్య 18,234… వేలిముద్రల సాయంతో ఛేదించిన కేసుల సంఖ్య 420. ఫింగర్ ప్రింట్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేశాం. ఇవాళ పోలీసుల వద్ద 10 లక్షల మంది నేరగాళ్ల డేటా బేస్ ఉంది.
24,127 దోపిడీ కేసులు… 2,432 పోక్సో కేసులు… 2,126 అత్యాచార కేసులు… 762 హత్య కేసులు నమోదయ్యాయి.
మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి.
తెలంగాణలో ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా 19,456 రోడ్డు ప్రమాదాలు జరిగాయి… 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంవత్సరం 431 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశాం.
2022లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఉప్పల్ పీఎస్ ఘనత సాధించింది. 1000కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే పీఎస్ ల కేటగిరీలో ఉప్పల్ ప్రథమస్థానంలో నిలిచింది.
ఇక 500 నుంచి 1000 లోపు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యే పీఎస్ ల కేటగిరీలో కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రథమస్థానంలో నిలిచింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/