తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా

వైరస్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే చికిత్స

telangana-deputy-speaker-padmarao

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు కాస్తంత అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం నుంచే హోమ్ క్వారంటైన్ అయ్యారు. ఆపై వైద్యాధికారులు నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపగా, కరోనా సోకినట్టు తేలింది. ఆయన కుటుంబంలో మరో నలుగురికి కూడా వైరస్‌ సోకింది.  వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మిగతా కుటుంబీకుల శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. వాటి ఫలితాలు వెలువడాల్సివుంది.

కాగా, మోండా మార్కెట్ కు దగ్గర్లోని టక్కర బస్తీలో నివాసం ఉండే పద్మారావు, ఇటీవలి కాలంలో, పలు సమీప బస్తీల్లో తిరిగి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన పర్యటనల్లో ఎవరి ద్వారానో ఆయనకు వైరస్ సోకుండవచ్చని తెలుస్తోంది. పద్మారావు ఇద్దరు మనవళ్లకు వైరస్ సోకిందని కుటుంబీకులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితీ మెరుగుపడుతోందని అన్నారు.

కాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/