తెలంగాణ కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ ప్రారంభం..

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈరోజు కీసర లో ‘నవకల్పన చింతన్ శిబిర్’ సమావేశాన్ని ప్రారంభించింది. చింతన్‌ శిబిర్​ తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌గా ఉంటాయని ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పై రెండు రోజులపాటు ఈ శిబిర్‌లో చర్చిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలోని బాల వికాస కేంద్రంలో పీసీసీ నవసంకల్ప మేథోమధన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను చింతన్ శిబిర్​లో చర్చిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అన్ని కమిటీలతో చర్చించి నివేదిక తయారు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని కాపాడేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి తెలిపారు. ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కాలేదని భట్టి స్పష్టం చేశారు. రెండు రోజులపాటు చింతన్ శిబిర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని తెలిపారు.

రాజస్తాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్రాల్లో చింతన్ శిబిర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పొత్తు ఉండని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతనే ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతోందని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఆరోపించారు.