హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే..ఉత్తమ్‌

దేశవ్యాప్తంగా బిజెపికి ఎంఐఎం మద్దతు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తెలంగాణ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎంపై మరోసారి మండిపడ్డారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనన్నారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, కృష్ణా జలాలు.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది తామేనన్నారు. కరోనా కారణంగా ప్రజలు మరణిస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం దానిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చలేదని, వరదలతో నగర వాసులు అల్లాడితే కెటిఆర్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్న ఉత్తమ్.. ఐటీ రీజియన్ రద్దయినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌లు ఇదేంటని ప్రశ్నించలేదని, అర్ధరాత్రి మాత్రం దొంగల్లా తమ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. బిజెపికి అన్ని విషయాల్లోనూ టిఆర్ఎస్ సహకరిస్తోందన్న ఆయన.. ఎంఐఎం కూడా బిజెపికి మద్దతు పలుకుతోందని, దేశవ్యాప్తంగా బిజెపికి ఎంఐఎం మద్దతు ఉందన్నారు. అందుకనే ఆ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/