నేడు కల్నల్‌ కుటుంబాని పరామర్శించనున్న సిఎం

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సాయం అందజేత

cm kcr

హైదరాబాద్‌: చైనాతో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే సంతోష్‌బాబు కుటుంబాన్ని సిఎం కెసిఆర్‌ ఈరోజు పరామర్శించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 2 గంటలకు సూర్యాపేట చేరుకుంటారు. అనంతరం కల్నల్ సంతోష్‌బాబు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంతోష్ కుటుంబానికి ఇప్పటికే ప్రకటించిన రూ. 5 కోట్ల నగదు, అతడి భార్య సంతోషినికి గ్రూప్1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అందించనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో కేటాయించిన ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అందిస్తారు. సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ వెళ్లనున్నట్లు సమాచారం. కాగా సిఎం వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో కరోనా నేపథ్యంలో ఎవ్వరూ రావద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/