జూన్ 21 న తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. స‌చివాల‌యంలో జ‌రిగే ఈ స‌మావేశానికి మంత్రులు, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. రుణ‌మాఫీ, అసెంబ్లీ స‌మావేశాలు, బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, పంట‌ల బీమాతో పాటు ప‌లు అంశాల‌పై కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతో ఆ హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ, ఇందుకోసం నిధులు ఎలా సేకరించాలనే అంశంపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించనుంది. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు అవసరం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం.

దీంతో పాటు రైతు భరోసాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం అమలుకు రూ.7 వేల కోట్ల బడ్జెట్ అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం రైతుబంధు మాదిరిగా కాకుండా.. రైతు భరోసాకు కటాఫ్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.