రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినేట్‌ మీటింగ్

రేపు (ఏప్రిల్ 12) మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌ సమావేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. ప్రగతి భవన్‌ వేదికగా ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రులంతా హాజరు కావాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశం లో యాసంగి కొనుగోలు అంశం, కేంద్రం పై పోరాటం, బీజేపీ పార్టీని ఎలా ఎదుర్కొవాలి, గవర్నర్‌ తమిళిసై వ్యవహారం వంటి పలు అంశాలపై చర్చ జరగనుంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి తో పాటు తెరాస నేతలంతా ఢిల్లీ లో వరి దీక్ష చేస్తున్నారు. వరి కొనుగోలు విషయం లో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఢిల్లీ వేదికగా కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలు వస్తేనే ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు గుర్తుకువస్తారని.. ఆ తర్వాత వారిని పట్టించుకోరని విమర్శించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం దిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేసారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీయూష్‌ గోయల్‌ ఉల్టా పల్టా మాట్లాడుతున్నాడని ..అసలు గోయల్‌ కు ధాన్యం కొనుగోళ్ల పై అవగాహన ఉందా అని నిలదీశారు. ధాన్యం సేకరణకు దేశంలో ఒకే విధానం ఉండాలి.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది.. ఇంతదూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? అని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ 24 గంటల డెడ్‌ లైన్ ఇచ్చారు. 24 గంటలలోపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే… రైతు ఉద్యమంతో.. భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.