తెలంగాణాలో లాక్‌డౌన్‌ సడలింపులు?

సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా ఆంక్షల సడలింపు?
జనం ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు
సీఎం కెసిఆర్ అధ్యక్షతన రేపు మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రెండో వేవ్‌ క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.

సీఎం కెసిఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కరోనా థర్డ్‌ వేవ్‌ వార్తల నేపథ్యంలో, ఒకవేళ వస్తే సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చిన్నారులకు అవసరమైతే వైద్య చికిత్స అందించేందుకు చేయవలసిన ఏర్పాట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య నిపుణుల భర్తీపై కేబినెట్‌ చర్చించనుంది. నీలోఫర్‌ పిల్లల ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రితో పాటు గాంధీ, నిమ్స్‌ వంటి ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను చేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. 


తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/