తెలంగాణలో 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం..

తెలంగాణలో 111 జీవోను ఎత్తివేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వికారాబాద్‌ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాల ప్రజలకు మంచి శుభవార్త అన్నారు. అయితే, జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని తొలగించి జీవో ఎత్తివేస్తామని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో మూసీ నది, ఈసా నది, రెండు జలాశయాలు కలుషితం కాకుండా.. గ్రీన్‌జోన్‌ డిక్లేర్‌ చేస్తూ, మాస్టర్‌ప్లాన్‌ ఇంప్లిమెంట్‌ చేస్తూ జీవో ఇంప్లిమెంట్‌ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం అవుతుందని, ఆ తర్వాత దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. అలాగే ఈ సమావేశంలో మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. అలాగే ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్న కేసీఆర్.. ఫార్మా యూనివర్సిటీతో పాటు .. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలు రానున్నాయన్నారు. యూనివర్సిటీ నియామకాల కోసం రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు కానుందని చెప్పారు.