జూన్ 22 నుంచి తెలంగాణ లో బోనాలు

త్వరలోనే హైదరాబాద్ నగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 22 నుండి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 22న గోలొండలో బోనాలు ప్రారంభం అవుతుండగా, జులై 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్‌ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. ప్రతి ఏటా తరహాలో ఈ ఏడాది కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. గోల్కొండలోని శ్రీజగదాంబిక, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి, పాతబస్తీలోని శ్రీ అక్కన్నమాదన్న లయాలతోపాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు.

బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో నిన్న బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయ లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు.