నేడు అసెంబ్లీ 10 గంటలకు నిరు‌ద్యో‌గుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రక‌టన

telangana-assembly-budget-session-enters-into-second-day

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజుకు చేరాయి. నేడు శాసన సభలో ప్రభుత్వం నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేసింది. బడ్జెట్‌పై చర్చకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.

కాగా, ఈరోజు ఉదయం 10 గంట‌లకు అంతా టీవీలు చూడండి. నిరు‌ద్యోగ యువ సోద‌రుల కోసం అసెం‌బ్లీలో ప్రక‌టన చేస్తానని వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రకటించారు. అస‌లు నిరుద్యోగుల‌కు కేసీఆర్ ఎలాంటి శుభ‌వార్త చెబుతారు? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న సీఎం వనపర్తి జిల్లాలో పర్యటనలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. నిరుద్యోగులు అంతా బుధవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు.

దీంతో తెలంగాణ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తారా ? లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారా ? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో లక్షకుపైగా ఖాళీలు ఉన్నాయి. అయితే, నేడు 60 వేల ఉద్యోగాల భర్తీపైనే కేసీఆర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీసు శాఖలోనే అధిక ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది.

కొత్త నియామకాలకు ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 2022-23 బడ్జెట్‌లో రూ. 4,000 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఒకేసారి 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం గతేడాది జూన్ లోనే ఆదేశాలిచ్చారు. తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ఎట్టకేలకు గతేడాది నుంచే మనుగడలోకి రావడంతో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి అవకాశం ఏర్పడిందనే అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ఖాళీలను కలిపి మొత్తం లక్ష ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. విడతల వారీగా కొలువుల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తొలి దశలో ఒకే సారి 50 వేల ఉద్యోగాలను ప్రకటించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/