బీజేపీలో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న

తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అన్న మల్లన్న

హైదరాబాద్: క్యూ న్యూస్ అధినేత‌ తీన్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు తరుణ్ ఛుగ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు.

అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… చింతపండు నవీన్ ను ప్రజలు తీన్మార్ మల్లన్న చేశారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని అన్నారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/