బేగంపేటలో ఎంఎంటీఎస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

బేగంపేటలో ఎంఎంటీఎస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్డు వద్ద సాంకేతిక లోపం కారణంగా ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురైయ్యారు. ఏంజరుగుతుందో అని చాలామంది ప్రయాణికులు కంగారుపడి ట్రైన్ దిగి పరుగులుపెట్టారు. ట్రైన్ అక్కడే కాసేపు నిలిచిపోయింది. సకాలంలో లోకో పైలెట్ స్పందించి సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పుకొచ్చారు. అధికారులు ఇంజిన్‌కు మరమ్మతులు పూర్తిచేయడంతో రైలు మళ్లీ కాసేపు తర్వాత బయల్దేరింది.

ఇదిలా ఉంటె దసరాకి సొంతూళ్లకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. 12 ప్రత్యేక రైళ్లతో పాటు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దసరాకి ప్రత్యేకంగా 12 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంచామని , అదేవిధంగా ఎనిమిది రైళ్లకి అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-సాంతరాగాఛి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-షాలిమార్-సికింద్రాబాద్, నాందేడ్-బెర్హంపుర్-నాందేడ్, త్రివేండ్రం-టాటానగర్-త్రివేండ్రం మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్-దర్భంగా-సికింద్రాబాద్ రైళ్లకు రెండేసి, సికింద్రాబాద్-హిస్సార్-సికింద్రాబాద్, హైదరాబాద్-హడప్‌సర్-హైదరాబాద్ రైళ్లకు ఒక్కో స్లీపర్ బోగీ అదనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.