మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధం

టెస్టు జట్టులోకి రోహిత్‌ శర్మ తిరిగి ప్రవేశం

Team India

సిడ్నీ: సిడ్నీలో గురువారం ఆరంభం కానున్న మూడో టెస్టుకు టీమిండియా సన్నద్ధమైంది. అందులో భాగంగా మంగళవారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీమిండియా చెమటోడ్చింది. టెస్టు జట్టులోకి తిరిగి ప్రవేశించిన రోహిత్‌ శర్మ సహచరులతో కలిసి సాధన చేశాడు.

ఫీల్డింగ్‌ కోచ్‌ రామకృష్ణన్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో జట్టు సభ్యులు ఫీల్డింగ్‌ వ్యాయామాలు చేశారు. ఫీల్డింగ్‌తోపాటు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కూడా ఆటగాళ్లు తమ ప్రతిభకు పదును పెట్టుకున్నారు. సాధనకు ముందు కోచ్‌ శ్రీధర్‌ ఆటగాళ్లతో సమావేశమై ప్రణాళికలపై చర్చించారు. పర్యాటక భారత జట్టు ఫీల్డింగ్‌లో సమస్యలు ఎదుర్కొంటుంది.

తొలి రెండు టెస్టులలో పలు క్యాచ్‌లను వదిలిపెట్టింది. క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అనే నానుడిని భారత బృందం ఇంకా వంటబట్టించుకోలేదు. ఈ అంశంలో మరింత శ్రద్ధ పెట్టి ఫీల్డింగ్‌ కోచ్‌ మంగళవారం చాలాసేపు క్యాచ్‌లు ప్రాక్టీస్‌ చేయించాడు.

ఫీల్డింగ్‌లో చతేశ్వర్‌ పుజారా వేలికి స్వల్ప గాయమవడంతో ఫిజియో చికిత్స అందించాడు. అయితే అది పుజారా స్థానానికి భంగం కలిగించేంత గాయం కాకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్‌ ఊపిరిపీల్చుకుంది. చికిత్స అనంతరం పుజారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలాసేపు బ్యాటింగ్‌ సాధన చేశాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో బ్యాలెన్స్‌గా ఉంది. తొలి టెస్టును ఆస్ట్రేలియా గెలుచుకోగా, రెండో టెస్టును టీమిండియా గెలుచుకుని సమఉజ్జీగా నిలిచింది. ఇపుడు మూడో టెస్టులో విజయంతో సిరీస్‌లో సురక్షిత స్థానంలో ఉండాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి.

సైనీ, శార్దూల్‌…ఎవరికి చోటు!

టీమిండియాలో మూడో పేసర్‌ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టులో షమి, రెండో టెస్టులో యాదవ్‌ గాయాలలో జట్టుకు దూరమవడంతో ఇక బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లకు తోడు మూడో పేసర్‌ స్థానం ఎవరన్నది మేనేజ్‌మెంట్‌ తేల్చాల్సి ఉంది.

ఈ స్థానానికి నవదీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌ పోటీపడుతున్నారు. వన్డే సిరీస్‌లో ఆడిన సైనీ వెన్ను నొప్పినుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నాడు. మంగళవారం నెట్స్‌లో సైనీ, శార్దూల్‌ బౌలింగ్‌లో పోటీపడ్డారు. వీరిద్దరిలో శార్దూల్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. శార్దూల్‌ ప్రథమశ్రేణి క్రికెట్‌లో 62 మ్యాచ్‌లలో 206 వికెట్లు పడగొట్టాడు. సైని 46 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. నిలకడగా 140కి.మీ. వేగంతో బంతులు సంధించగలగడం అతని ప్రత్యేకత. తుది జట్టులో ఎవరుంటారన్నది మ్యాచ్‌కు ముందుగానీ తేలదు.

సిరీస్‌కు రాహుల్‌ దూరం

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కెఎల్‌ రాహుల్‌ బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ మణికట్టుకు గాయమవడంతో టెస్టు జట్టునుంచి అతడిని తప్పించారు. దీనితో ఆస్ట్రేలియా పర్యటనలో రాహుల్‌ అవకాశాలకు తెరపడింది. శనివారం సాధన సందర్భంగా రాహుల్‌ గాయపడినట్టు జట్ట మేనేజ్‌మెంట్‌ తెలిపింది.

‘రాహుల్‌ కోలుకోడానికి మూడు వారాల సమయం పడుతుంది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొంటాడు అని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

రాహుల్‌తో టీమిండియాలో గాయపడి జట్టుకు దూరమైన ఆటగాళ్ల జాబితా పెరిగింది. తొలుత షమి, ఆ తరువాత ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డారు. తొలి టెస్టు అనతరం కెప్టెన్‌ కోహ్లీ పితృత్వ సెలవ్ఞపై స్వదేశానికి వచ్చాడు. కాగా గాయపడిన రాహుల్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభయ్యే సిరీస్‌ ఆరంభమయ్యే నాటికి కోలుకుని జట్టుకు ఎంపికయ్యేదికూడా అను మానంగా మారింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/