నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థుల ఫై పూల వర్షం కురిపించిన టీచర్లు

18 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ తెరుచుకున్నాయి. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమైన పిల్లలు బడి బాట పట్టారు. బ్యాగులు భుజాన వేసుకుని స్కూళ్లకు పరుగులు పెట్టారు. పాఠశాలల పునఃప్రారంభంతో స్కూళ్లన్నీ సందడిగా మారాయి. ఈ తరుణంలో పలు స్కూల్స్ లలో అరుదైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో ఇన్నాళ్లకు విద్యార్ధులు స్కూలుకు రావడంతో ఆనందం పట్టలేక పోయిన ఉపాధ్యాయులు వారిపై పూల వర్షం కురించి పులకించిపోయారు. కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా మా పిల్లలకు దూరంగా ఉన్నామనీ. దీంతో వారిని చూడలేకపోయామే అన్న బాధ మాలో ఎంత కాలంగానో దాగి ఉందనీ.. ఇప్పుడు స్కూళ్లు తెరుచుకోవడంతో మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని టీచర్లు చెప్పుకొచ్చారు. కరోనా భయం వెంటాడుతున్నా, పిల్లల భవిష్యత్ కోసమే స్కూళ్లకు పంపుతున్నామని తల్లిదండ్రులు చెపుతున్నారు. ఇక మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 40శాతం విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యారని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత… ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని సూచించారు.