ఉపాధ్యాయుల పరిస్థితి పట్ల పవన్ ఆవేదన

లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం

Pawan Kalyan

అమరావతి: ఏపిలో లాక్‌డౌన్‌ సడలిపుల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టింది. అయితే పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం దృష్ట్యా ఇలాంటి విధులు సరికాదని హితవు పలికారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం సబబుగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.

మద్యనిషేధం అని చెప్పి మాట మార్చారు

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీగా మారింది. సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్‌ఆర్‌సిపి… అధికారంలోకి వచ్చాక విడతల వారీగా బంద్ చేస్తామని మాట మార్చింది. మద్యాన్ని నిషేధించడానికి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి ఇప్పుడొక మంచి అవకాశం. కానీ వారు వైన్ షాపులు తీసేందుకే మొగ్గుచూపారు’ అని పవన్ చెప్పారు. దాని ఫలితం ఇదేనంటూ సోషల్ డిస్టెన్స్ లేకుండా పొడవాటి క్యూలో జనాలు నిల్చున్న వీడియోను పోస్ట్ చేశారు. సామాజిక దూరం పాటించడం కష్టమంటూ ఆలయాలు, చర్చిలు, మసీదులను బలవంతంగా మూసేశారని, లిక్కర్ షాపులకు మాత్రం ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. మద్యం విక్రయాలకు సామాజిక దూరం లేకపోయినా పర్వాలేదా? అని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/