ఏపీ లో పీఆర్సీపై రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

అమరావతి: ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ విడుదల చేసిన జీవోలతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసనలకు దిగారు. గుంటూరు, విజయవాడ నెల్లూరు, కడప, చిత్తూరు, విశాఖ, కర్నూలుతో పాటూ అన్ని చోట్లా కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతించకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు పలు జిల్లాలో ముందస్తుగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ముందస్తు అరెస్టులు చేస్తుండడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నోటీసులు పట్టించుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అన్ని కలెక్టరేట్ల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కలెక్టరేట్లకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు.

.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/