తరగతి గదిలో ఉమ్ము ఉంచాడని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయురాలు

తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు అనుమతి అడుగుతున్న క్రమంలో విద్యార్థిని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. అంతే అది చూసి ఆగ్రహించిన ఆమె కర్రతో విద్యార్థిని ని చితకబాదింది. ఈ ఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే

గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్‌కుమార్‌ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో సంజీవ్ ను ఇష్టంవచ్చినట్లు కొట్టింది. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకు ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్‌ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని సమాధానం ఇచ్చింది. విద్యార్థి తల్లిదండ్రులు పిర్యాదు మేరకు విద్యాధికారి ఆమెను సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తుంది.