కేడర్‌కి భరోసా కల్పించలేకపోతున్న టిడిపి

ఎపి బిజెపి విడుదల చేసిన ప్రకటనతో టిడిపిలో తీవ్ర ప్రకంపనలు

TDP situation in AP
TDP situation in AP

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది రాష్ట్ర టిడిపి పరిస్థితి. 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీకి గుడ్‌బై చెపుతున్న నాయకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.తాజాగా ఎపి బిజెపి విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్‌లో తమపార్టీని బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వా నిస్తున్నట్టు ఆ ప్రకటనలో బిజెపి రాష్ట్రశాఖ పేర్కొంది. ఇందులో భాగంగానే వివిధ వర్గాల నేతలతో సోము వీర్రాజు సమావేశం కాబోతున్నారని పార్టీ తెలిపింది.

ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, అనంతరం మాజీ మంత్రి టిడిపి నాయకుడు కిమిడి కళా వెంకటరావులతో వారి నివాసాల్లో సోమువీర్రాజు సమావేశం అవ్ఞతారని బిజెపి స్పష్టంగా పేర్కొంది.

ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణా మాల గురించి చర్చించే అవకాశం ఉందని కూడా బిజెపి స్పష్ట పరిచింది. బిజెపి ప్రకటనలో టిడిపి ముఖ్యనాయకుడు కళావెంకట రావ్ఞను కలవనున్నట్లు పేర్కొనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ ఉలిక్కి పడింది. పైగా కళావెంకటరావ్ఞ బిజెపిలోకి చేరనున్నారని మీడియా లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో టిడిపి ఆందోళన చెందింది. అసలే ఎప్పుడెవరు పార్టీ మారుతారో తెలియని అయోమయ స్థితి టిడిపిలో నెలకొంది.

ఈ పరిస్థితిలో నిన్నమొన్నటివరకు ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళావెంకటరావ్ఞ బిజెపిలో చేరనున్నా రనే వార్తలు టిడిపిని సహజంగానే ఉక్కిరిబిక్కిరి చేశాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజే స్వయంగా కళావెంకటరావ్ఞ ఇంటికి వెళ్లనున్నారని ఆ పార్టీ ఏకంగా ప్రకటన ఇవ్వడం సంచలనం రేకె త్తించింది.

పార్టీ మార్పుపై పెద్దఎత్తున ప్రచారం కావడం, మరో వైపు టిడిపి అధిష్టానం నుంచి ఒత్తిళ్లనేపథ్యంలో కళా వెంకటరావ్ఞ ఎట్టకేలకు స్పందించాల్సి వచ్చింది. టిడిపితో చంద్రబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తానేకాదు తన వారసులు కూడా టిడిపిలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. టిడిపి మాజీ అధ్యక్షుడు,మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును తను కలవడం లేదని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ రంగాల ప్రముఖులను కలుస్తున్నట్టుగానే ముద్రగడను కలవబో తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చెప్పినట్లుగానే ముద్రగడతో భేటీ అయ్యారు. టిడిపిలో అనేక పదవ్ఞలు అనుభవించిన కళా వెంకట రావ్ఞ పార్టీ కష్టకాలంలో ఉండగా 2009లో పార్టీ మారారు. తమ సామాజిక వర్గానికే చెందిన మెగాస్టార్‌ చిరంజీవి 2009లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టగానే అందులోకి ఫిరాయించడాన్ని శ్రీకాకుళం టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు.

ఎపి బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు తమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, మరోవైపు టిడిపికి భవిష్యత్‌లేదనే సంకేతాలుండటం వల్లే కళా వెంకటరావ్ఞ చూపులు చూస్తున్నారనే అనుమా నాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతు న్నాయి. పార్టీ అధినాయ కత్వంపై నమ్మకం లేక ఈ పార్టీ మార్పులు జరుగుతున్నాయనే అభిప్రాయం కలుగు తుంది. 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు చందంగా మారింది.

పార్టీకి ఒక స్పష్టమైన విధివిధానం లోపించింది. ఒకే అంశంపై పార్టీ నిర్ణయం వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా ఉంటూ కేడర్‌ని అయోమయం లోకి నెట్టేస్తుంది. రాష్ట్రంలో పార్టీ ఓటమి చెందిన తరువాత వైసిపి ప్రభుత్వంలో అరెస్ట్‌ కాబడిన మాజీ మంత్రులు అచ్చంనాయుడు, కొల్లు రవీంద్రల విషయంలో స్పందించిన పార్టీ అధిష్టానం తెలంగాణలో ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ కాబడ్డ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో ఎటువంటి స్పందన కనబర్చక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దగ్గర బంధువులను ఓ ప్రైవేట్‌ ప్రాపర్టీ విషయంలో కిడ్నాప్‌ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలప్రియను కనీసం పలకరించకపోవడం బాబుకి తెలంగాణలో ఉన్న కేసుల భయం కారణం అయి ఉండవచ్చు. స్వప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టడం దేనికి సంకేతం? పార్టీ అధిష్టానం ఎప్పుడు, ఎలా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థంకానీ అయోమయంలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

పార్టీ నుండి ఖచ్చితమైన భరోసా ఉంటుందనే నమ్మకం నాయకుల్లో సన్నగి ల్లింది. కష్టకాలంలో నమ్ముకున్న పార్టీ, ఆ పార్టీ అధినేత ముఖం చాటేయడంతో కేడర్‌లో నిరాశనిస్పృహతో కొట్టుమిట్టాడుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని చెప్పుకునే టిడిపి అధినేత ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పాత్ర పోషించలేకపోతున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. వయస్సురీత్యా కూడాచంద్రబాబు పార్టీపైపూర్తిస్థాయి దృష్టి నిలపలేకపోతున్నారు.

పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం చురుగ్గా అడుగువేయవలసిన సమయం ఇంది. కానీ తెలుగుదేశం తదుపరి నాయకుడు ఎవరు అనేది అర్థంకానీ ప్రశ్న. తన రాజకీయ వారసునిగా తన కొడుకు లోకేష్‌ను నిల పాలనే బాబు ఆశ నిరాశను మిగిల్చింది. ఇక పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కొడుకు బాలకృష్ణ రెండుసార్లు శాసనసభ్యునిగా గెలిచినా చంద్రబాబు ఎంతో ముందుచూపుతో ఆయనను హిందూపురానికే పరిమితం చేసి తనకు అడ్డుపడకుండా చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బాలకృష్ణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండాలనే అభిలాషను వ్యక్తం చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్‌చల్‌ చేసింది. ఇది నిజం అవ్ఞతుందో లేదో! తెలుగు జాతి భూమి మీద ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఒకప్పుడు చెప్పిన టిడిపి నాయకులే ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్‌పై సందేహం వెళ్లబుచ్చుతున్నారు.

ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు మీడియా ముందుకు వచ్చి డబ్బాలు కొట్టుకోవడమే మినహా చంద్రబాబు తరువాత పార్టీని నడిపించే సమర్థవంతమైన నాయకుడు ఎవరు అని గంటల కొద్దీ ఆలోచించినా వారికి జవాబు దొరకని స్థితి టిడిపికి నెలకొంది. ప్రాంతీయ పార్టీలలో ఇదేపరిస్థితి ఉంటుంది. వారసత్వ రాజకీయం కొనసాగుతుంది.

దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రాంతీయ పార్టీలలో ఇదే తంతు కనిపిస్తుంది. దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండబో తుందా? ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కానీ, లోకేష్‌ కానీ పార్టీ అత్యున్నత స్థానంలో లేకుండా టిడిపి మనుగడ సాధిస్తుందా? దీనికి కాదనే సమాధానం వినిపిస్తుంది. 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

  • – డా.జొన్నకూటి ప్రమోద్‌కుమార్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/