టీడీపీ సీనియర్ నేత బొజ్జల ఇంట్లో మరో విషాదం

టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. గోపాలకృష్ణా రెడ్డి మరణించిన కొద్ది రోజులకే ఆయన సోదరుడు హరినాథ్ రెడ్డి కన్నుమూశారు. మే 6న బొజ్జల మరణించగా.. బుధవారం ఆయన కర్మలు శ్రీకాళహస్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని బొజ్జల హరినాథరెడ్డి స్వయంగా పలకరించారు. సాయంత్రం సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన హరినాథ రెడ్డి.. బాత్రూంలో జారిపడిపోయారు.

బాత్రూంలోకి వెళ్లిన హరినాధ్ ..ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆయన బాత్రూంలో పడిపోయి ఉన్నారు. దీంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన తో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బొజ్జల స్వగ్రామమైన ఊరందూరులో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.

ఇక బొజ్జల విషయానికి వస్తే..చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003, అక్టోబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అలిపిరి వద్ద నక్సల్స్ క్లైమోర్ మైన్స్ పేల్చిన సమయంలో..చంద్రబాబుతో పాటుగా బొజ్జల సైతం గాయపడ్డారు. బొజ్జల తండ్రి సైతం శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా పని చేసారు. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు సుధీర్ రెడ్డి ఇప్పుడు శ్రీకాళహస్తి టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. చంద్రబాబుతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం బొజ్జల మంచి స్నేహితుడు.