కర్నూలు లో చంద్రబాబు కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

కర్నూల్ జిల్లాలో టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూల్ జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరిన బాబు.. కర్నూలు జిల్లా, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

అక్కడ టీడీపీ నేతలు, విద్యార్థులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఎయిర్ పోర్ట్ వద్ద విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ‘జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఈ విషయంలో నాకంటే చెప్పేవాడు కానీ, చేసేవాడు కానీ ఎవరూ లేరన్నారు.

టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. అవి కొనసాగి ఉంటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారన్నారు. కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామన్నారు. కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని, సోలార్ పార్క్ తెస్తే కమీషన్‌ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని.. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని చంద్రబాబు అన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరన్నారు. ప్రతి కార్యక్రమం ఇక్కడ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు.

ఇక రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు.. గురవారం పట్టణంలో రోడ్డు షో నిర్వహిస్తారు. రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు… శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.