ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతల నిరసనలు

చంద్రబాబు ఫ్యామిలీ ఫై అసెంబ్లీ లో వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ఫై తెలుగుదేశం నేతలు , కార్య కర్తలు , నందమూరి ఫ్యామిలీ అభిమానులు , కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. మీ రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న ఆడవారిని లాగుతారా అంటూ ప్రశ్నింస్తున్నారు. గతంలో ఎన్నడూ మీడియా ముందుకు రాని నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసారు. ఇంకోసారి ఆడవారిని లాగితే ఆ తర్వాత సీన్ మరోలా ఉంటుందంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వంటి వారు సైతం వార్నింగ్ లు ఇచ్చారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో వైకాపా నాయకులు విమర్శలు చేయడం తగదని తెదేపా నేతలు హెచ్చరించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు నేతలను , కార్యకర్తలను అరెస్ట్ చేసారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం నాయకులు ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణని పోలీసులు అరెస్టు చేశారు.