జగన్‌కు ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఇష్టంలేదు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో దశ నామినేషన్ల పురోగతిపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులందరికీ అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టిడిపి చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైఎస్‌ఆర్‌సిపి చూస్తోంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. వైఎస్‌ఆర్‌సిపి వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు.

‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా.. పోలవరానికి నిధులు లేవు. అమరావతికి నిధులు లేవు. నేరాలు-ఘోరాలు చేయడం, వాటిని ఎదుటివాళ్లపై రుద్దడం జగన్ దుష్టబుద్ధి. బాబాయి వివేకానందరెడ్డి హత్య గుండెపోటుగా చిత్రించడం. తర్వాత టిడిపిపై ఆరోపణలు చేయడం. సీఎం అయ్యాక నిందితుల కొమ్ము కాయడం జగన్ నైజం. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ అడిగిన జగన్.. సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారు..? బాబాయి హత్యకేసులో నిందితులను కాపాడటం వెనుక మర్మం ఏమిటి..?’ అని నిలదీశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/