ఈరోజు నుండి టీడీపీ మహానాడు సంబరాలు

టీడీపీ మహానాడు సంబరాలు ఈరోజు నుండి మొదలుకాబోతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సంబరాలకు ఒంగోలు సిద్ధమైంది. ఒంగోలు నగరమంతా పసుపుమయంగా మారింది. మ‌రికొద్ది గంట‌ల్లో మ‌హానాడు ప్రారంభం కానుంది. ఒంగోలు స‌మీపంలోని మండ‌వ‌వారి పాలెం వ‌ద్ద 80 ఎక‌రాల సువిశాల మైదానంలో మ‌హానాడు జ‌రుగుతోంది.

దీనికి ఎన్టీఆర్ ప్రాంగ‌ణంగా పేరు పెట్టారు. ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఒంగోలుకు చేరుకున్నారు. గురువారం మంగ‌ళ‌గిరి నుంచి చంద్ర‌బాబు కార్లు, బైక్ ర్యాలీల‌తో ఒంగోలు చేరుకోగా.. అడుగ‌డుగునా టీడీపీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఆన్‌లైన్ ప‌ద్ద‌తిలో జ‌రిగిన మ‌హానాడును ఈసారి అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని పార్టీ భావిస్తోంది.

2018 తర్వాత తెదేపా మళ్లీ ఇప్పుడే పార్టీ మహానాడుని బహిరంగ వేదికపై, అట్టహాసంగా నిర్వహిస్తోంది. 2019లో ఎన్నికల వల్ల ప్రత్యేకంగా మహానాడు నిర్వహించలేదు. 2020, 2021ల్లో కొవిడ్‌ ఉద్ధృతంగా ఉండటం వల్ల ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించారు. మహానాడులో పాల్గొనేందుకు పార్టీ నాయకత్వం, కేడర్‌ ఉత్సాహంగా ఉంది. ఈ సారి మ‌హానాడులో రెండు రాష్ట్రాల‌కు సంబంధించి 17 తీర్మానాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఇదిలా ఉంటే మ‌హానాడులో జ‌న‌సేన‌తో పొత్తు అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. టీడీపీ శ్రేణుల్లో ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే లాభ‌మ‌నే ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది. బీజేపీతో ఎటువంటి వైఖ‌రి అవ‌లంభిస్తారో కూడా మ‌హానాడు వేదిక‌గా స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.