పంచాయతీ ఎన్నికల్లో అసలైన గెలుపు టిడిపిదే

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో అస‌లు సిస‌లైన‌ గెలుపు టిడిపిదేనని ఆ పార్టీ నేత నారా లోకేశ్ చెప్పారు. ఎన్నిక‌ల్లో వైఎస్‌ఆర్‌సిపి నేత‌లు ఎన్ని చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా త‌మ పార్టీ నేత‌లు ఎదుర్కొని నిలిచార‌ని చెబుతూ ట్వీట్లు చేశారు.

‘డెమోక్ర‌సీకి, జ‌గ‌న్ మోనోక్ర‌సీకి మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొంత తేడాతో సంఖ్యా విజ‌యం వైఎస్‌ఆర్‌సిపి ‌దైనా అస‌లు సిస‌లు గెలుపు టిడిపిదే. అంబేద్క‌ర్ రాజ్యాంగం ప్ర‌కారం జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లను వైఎస్ జ‌గ‌న్ త‌న‌ రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు’ అని లోకేశ్ విమ‌ర్శించారు.

‘మ‌న ‌దేశానికి అర్ధ‌రాత్రి స్వాతంత్య్రం వ‌స్తే, నాలుగు విడ‌త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అర్ధ‌రాత్రి జ‌గ‌న్‌రెడ్డి ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్‌కి స్వాతంత్య్రం వ‌చ్చింది. టిడిపి మ‌ద్ద‌తుతో పోటీచేసే అభ్య‌ర్థుల్ని చంపేశారు, నామినేష‌న్ వేయ‌కుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భ‌య‌పెట్టారు’ అని లోకేశ్ ఆరోపించారు.

‘క‌ట్టేసి కొట్టారు, అయినా వెన‌క్కిత‌గ్గ‌ని టిడిపి అభ్య‌ర్థులు లెక్కింపులో ముందంజ‌లో వుంటే.. క‌రెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాల‌కు తాళాలేశారు. పోలీసుల‌తో బెదిరించారు. దాడులు చేశారు. టిడిపి మ‌ద్ద‌తుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు ప్ర‌క‌టించుకున్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.

‘ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఎన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌కు పాల్ప‌డినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టిడిపి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, అభిమానులంద‌రికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని లోకేశ్ అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/