టిడిపి ధర్మ పరిరక్షణ యాత్ర ఆగదు

అలిపిరి వద్ద టిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు..ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్

అమరావతి: టిడిపి ధర్మ పరిరక్షణ యాత్రను తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలో నిర్వహించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుపతిలోని అలిపిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్రను పోలీసులు అడ్డుకోవడం పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న ఇచ్చిన అనుమతి ఈ రోజు ఎందుకు రద్దయిందంటూ లోకేశ్ నిలదీశారు.

దేవాలయాలపై దాడులు, దళితులపై దమనకాండ, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేపడుతున్న ధర్మ పరిరక్షణ యాత్రకు జగన్ రెడ్డి ఎందుకు మతం రంగు పూస్తున్నారని ప్రశ్నించారు. ధర్మాన్ని కాపాడమంటే క్రిస్టియన్ సీఎంకు ఎందుకంత కోపం? రాష్ట్రంలోని అన్ని మతాల వారిని సమానంగా చూడమంటే ఎందుకంత అసహనం? అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ధర్మాన్ని కాపాడమని అడిగినందుకు టిడిపి నేతలను అక్రమంగా నిర్బంధించడాన్ని, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మ పరిరక్షణ కోసం టిడిపి పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/