అయ్యనపాత్రుడి ఇంటి గోడ కూల్చడం ఫై సర్కార్ ఫై టీడీపీ నేతల ఆగ్రహం..

పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చారు. దీనిపట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, ఇల్లు కూల్చివేతలకు పాల్పడుతుందన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించినా ప్రజా పక్షాన తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అయ్యన్న పాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టి గోడ కూల్చారని తెలిపారు. అయ్యన్న పాత్రుడిపై ప్రభుత్వం పదే పదే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. అధికారంలో ఉన్న పక్షానికి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. టీడీపీ కార్యక్రమాలకు జనం భారీగా వస్తుండడంతో అటు సీఎం జగన్, ఇటు వైసీపీ మంత్రులు, పార్టీ ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. ప్రజల నుంచి చంద్రబాబుకు లభిస్తున్న మద్దతును చూసి సీఎం జగన్ ఓర్వలేక, టీడీపీ నేతలపై పరోక్షంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. చోడవరం మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆయన ఇంటి గోడను కూల్చడం దారుణమన్నారు.