పంచె కట్టులో నారా లోకేష్ నయా లుక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంచె కట్టులో కనిపించి అదరగొట్టాడు. రేపటి నుండి లోకేష్ పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పంచెకట్టులో లోకేష్ స్వామి వారిని దర్శించుకున్నారు. లోకేష్ పంచె కట్టులో చాల కొత్త గా కనిపించారు. దర్శనంతరం నారా లోకేష్‌కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో శ్రీకృష్ణ అతిధి గృహంలో అల్పాహారం స్వీకరించిన అనంతరం.. లోకేష్ పార్టీ నేతలతో కలిసి నేరుగా కుప్పం వెళ్లనున్నారు. అక్కడ పాదయాత్ర కమిటీలతో సమావేశంకానున్నారు.. ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

నిన్న హైదరాబాద్ లో లోకేష్ తన ఇంట్లో కుటుంబంతో కలిసి పూజ‌లు నిర్వ‌హించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేశ్, అత్తామామ‌లు, బంధువులంద‌రి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని, నంద‌మూరి తార‌క‌రామారావుకి నివాళులు అర్పించారు. అక్కడి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని క‌డ‌ప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి. కడప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.

అనంత‌రం కడప పెద్ద దర్గాని సంద‌ర్శించి, మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. అక్కడి నుండి మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమ‌ల చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుప్పం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తారు. లోకేష్ పాదయాత్ర 400 రోజులు 4 వేల కిలోమీట‌ర్లు కొనసాగనుంది.