మహానాడు నుండి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత

మహానాడు నుండి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి చెందిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం సమనస పరిధిలోని రంగాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరెళ్ల రామాంజనేయులు (51) మహానాడు అనంతరం ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొత్తపేట సమీపంలోని మందపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు భార్య అంబామణి, కుమారుడు సందీప్, కుమార్తె ఫాల్గుణి ఉన్నారు. ఈ విషయం తెలిసిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం రామాంజనేయులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధినేత చంద్రబాబు, ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు నిర్ణయించినట్టు చినరాజప్ప తెలిపారు. కాగా, రామాంజనేయులు అన్న కరెళ్ల సుబ్రహ్మణ్యం, ఆయన భార్య విజయలక్ష్మి కూడా ఇలానే మృతి చెందారు. విజయవాడలో 1996లో జరిగిన టీడీపీ సింహగర్ణన సభకు హైదరాబాద్ నుంచి వస్తూ రోడ్డు ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు.