ఏపి ప్రభుత్వాంపై బుద్దా విమర్శలు

ఏపిలో ఉన్నది ప్రజాస్వామ్యమా… జగన్ స్వామ్యమా?: బుద్దా

buddha venkanna
buddha venkanna

అమరావతి: నంద్యాలలో సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు చూశాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. జగన్ స్వామ్యం నడుస్తోందా అనే అనుమానం కలుగుతోందని టిడిపి నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులపై, వారిని పరామర్శించిన వారిపై, టిడిపి నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే, జగన్ ప్రభుత్వం నలుగురి మరణానికి కారకులైన పోలీసులపై బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటి? అని ప్రశ్నించారు. అబ్దుల్ సలాంపై మోపిన దొంగతనం అభియోగాలన్నీ తప్పుడివే అని వ్యాఖ్యానించారు. చేయని నేరం ఒప్పుకోమని సలాంని, అతని భార్యని స్థానిక డీఎస్పీ శివానందరెడ్డి, సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి దారుణంగా హింసించారన్నారు. నంద్యాల ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కనుసన్నల్లోనే అతని ప్రధాన అనుచరుడైన బంగారు దుకాణం యజమాని, సలాంపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సలాం కుటుంబం చావులకు కారకులైన పోలీసులపై క్రిమినల్ కేసులుపెట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి వారికి శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సలాం, అతని భార్య ఎంతలా మానసిక క్షోభ అనుభవిస్తే… చిన్నపిల్లలను సైతం తాళ్లతోకట్టి, రైలుకింద పడతారని అన్నారు. చిన్నారుల చావుకేకలు ముఖ్యమంత్రికి వినపడలేదా? అని నిలదీశారు. రూ.25లక్షల పరిహారమిచ్చి, జరిగిన దారుణాన్ని ముఖ్యమంత్రి కప్పిపెట్టాలని చూశారని మండిపడ్డారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు అవసరం లేదని, చనిపోయేముందు సలాం విడుదల చేసిన సెల్ఫీ వీడియో చాలని తెలిపారు. ఈ ప్రభుత్వం నిజంగా మైనారిటీల ప్రభుత్వమే అయితే.. ఖాకీలరూపంలో ఉన్న నలుగురు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/