రాష్ట్రంలో ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోంది

జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు.. బుద్ధా వెంకన్న

buddha venkanna
buddha venkanna

అమరావతి:  టిడిపి నేత బుద్ధా వెంకన్న  ఏపి ప్రభుత్వంపై  మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందని బుద్ధా వెంకన్న విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ఒక్క ఛాన్స్ తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు. సోషల్ మీడియాలో సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.  టిడిపి నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్న వారిని వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తున్నారో, రాక్షసులు పాలిస్తున్నారో అర్థంకావడం లేదని ఆయన దుయ్యబట్టారు.

టిడిపిని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదని  స్పష్టం చేశారు. రాజధాని మార్చడమంటే.. రంగులు మార్చినంత ఈజీ కాదన్నారు. పైకి ప్రత్యేక హోదా.. లోపల కేసుల మాఫీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంలో దాదాపు 1,500 మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గద్దని పోలీస్ శాఖను వేడుకుంటున్నానని వెంకన్న తెలిపారు. నారా లోకేష్‌ను ఏదో విధంగా అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపాలనే ప్రయత్నంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు.  చంద్రబాబును మానసికంగా వేధించాలని చూస్తే.. ప్రపంచంలోని తెలుగు వారంతా తిరగబడతారని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/