జగన్, వైస్సార్సీపీ నేతలు వాడిన భాషపై చర్చకు సిద్ధమా?

చంద్రబాబు దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు

మంగళగిరి: టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించిన 36 గంటల దీక్షలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ డీజీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందన్న ఆవేదనతో పోరాడుతున్న వారిపై దాడికి దిగుతున్నారని అన్నారు.

జగన్, వైస్సార్సీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించడంలో సీఎం, డీజీపీ కుట్ర ఉందన్నారు. చంద్రబాబు నివాసం తర్వాతే పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించారని అన్నారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదని, సమాజ చైతన్యం కోసమే చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారని అన్నారు. డీజీపీ తీరుతో ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/