ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు

వైఎస్‌ఆర్‌సిపి సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు

శ్రీకాకుళం: ఏపి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అంతకుముందు నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టిడిపి కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది.


కాగా, అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైఎస్‌ఆర్‌సిపి ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని చూశారు. అయితే అచ్చెన్నాయుడు బెదిరించనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అక్కడ వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. నేరుగా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను దాడి చేయండి, తన్నండి, చంపండి అంటూ రెచ్చగొట్టారు. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని రోడ్లపై భారీ ఎత్తున వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వారెవరిపైనా కేసులు నమోదు అవలేదు. అచ్చెన్నాయుడుపై మాత్రం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు ఆధారంగానే అచ్చెన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/